
‘‘మానవుడు కోరికలు లేని మనసు ద్వారా తనను తాను ఉద్ధరించుకోవాలి. స్వీయ వినాశనానికి పాల్పడకూడదు. మనిషికి తనకు వశమైన మనసే బంధువు, తనకు వశంకాని మనసే శత్రువు’’ అని భగవద్గీతలోని ‘ఉద్ధరే దాత్మనాత్మానాం’ అనే గీతా శ్లోకంలో శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు.ఈ శ్లోకంలో అనేక కోణాలు కనిపిస్తాయి. వాటిలో మొదటిది... తనను తాను ఉద్ధరించుకోవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి మీదా ఉంటుంది. మనం చేసిన కర్మల వల్ల చెడు జరిగినప్పుడు లేదా ఆశించిన ఫలితాలు రానప్పుడు కుటుంబాన్నో, స్నేహితులనో, సహోద్యోగులనో, పరిస్థితులనో, పని వాతావరణాన్నో, దేశాన్నో తప్పు పట్టడం లేదా మనల్ని మనమే నిందించుకోవడం సర్వసాధారణంగా జరిగే విషయం. ఇది చాలా తీవ్రమైన కక్షలు పెరిగిపోవడానికి, ఇతరుల పట్ల ద్వేషానికి కారణమవుతుంది. కొందరిలో ఈ వైఖరులు జీవితాంతం కొనసాగుతాయి. మరోవైపు, మన జ్ఞాపకాలు మనల్ని పశ్చాత్తాపాన్ని గుర్తుచేసినప్పుడల్లా... మనల్ని మనం పదేపదే శిక్షించుకుంటాం. పరిస్థితులు ఏవైనప్పటికీ... మనల్ని మనం ఉద్ధరించుకోవాలని ఈ శ్లోకం మనకు చెబుతుంది. శరణాగతి, ప్రశ్నించడం, సేవ అనే మూడు లక్షణాలను మనలో అభివృద్ధి చేసుకున్నప్పుడు... మనకు సాయం చెయ్యడానికి గురువు మనల్ని చేరుతాడని అంతకుముందు కృష్ణుడు తెలిపాడు.
రెండోది... మనలోని పరిపూర్ణతలను, లోపాలను సమానంగా స్వీకరించడం ద్వారా... మన అసమర్థతలుగా భావించుకొనేవాటిని అధిగమించడం. అది మన భౌతికమైన రూపం కావచ్చు, సక్రమంగా లేని గతం కావచ్చు, విద్యాపరమైన, ఆర్థికపరమైన స్థాయి కావచ్చు, మనం ఎదుర్కొన్న ఆహ్లాదమైన, అసహ్యమైన పరిస్థితులు కావచ్చు. మూడోది... మనకు మనమే స్నేహితులుగా ఉన్నప్పుడు... నిరాశ, కోపం, మత్తుపదార్థాలకు లేదా వినోదపు తెరలకు బానిస కావడం లాంటి వాటికి ప్రధాన కారణమైన ఒంటరితనానికి అవకాశం ఉండదు. ముఖ్యంగా వృద్ధాప్యానికి దగ్గరవుతున్నప్పుడు... ఎవరి మీదా ఆధారపడకుండా సంతోషంగా ఉండడానికి ఇది దోహదం చేస్తుంది. చివరిగా... ఇది శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా మన గురించి మనం శ్రద్ధవహిస్తూ... సమతుల్యమైన జీవనం గడపడానికి సంబంధించిన విషయం. ఆలా గడిపినప్పుడు జీవితంలోని ప్రతి అంశం చక్కగా ఉంటుంది. మనం మనతో స్నేహం చేసుకుంటే జరిగే సహజ పరిణామం ఏమిటంటే... పక్షపాతంగా వ్యవహరించడం, ఇతరుల ప్రవర్తన మీద తీర్పులు చెప్పడం లాంటివి వదిలేస్తాం. అప్పుడు మొత్తం ప్రపంచం మనకు స్నేహితుడిగా మారుతుంది. సకల లోకానికీ మనం స్నేహితులం అవుతాం.
https://www.andhrajyothy.com/2024/navya/lets-be-friends-with-us--1248438.html