Gita Acharan |Telugu

మన అంతర్గతమైన (లోపలి), బహిర్గతమైన (వెలుపలి) ప్రపంచాలకు ఇంద్రియాలు ద్వారాల్లాంటివి. కాబట్టి వాటిని అర్థం చేసుకోవాలని భగవద్గీత పదేపదే చెబుతుంది. ‘ఒకటిగా పని చేసే న్యూరాన్లు (నాడీ కణాలు) ఒక్కటిగానే ముడిపడి ఉంటాయి’ అని నాడీశాస్త్రం ప్రతిపాదిస్తుంది. దానినే ‘హార్డ్‌ వైరింగ్‌’ అంటారు. మన మెదడులో 100 బిలియన్‌ కోట్ల న్యూరాన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని మన డిఎన్‌ఎ కారణంగా ముడిపడి, అసంకల్పితంగా జరిగే ప్రాథమిక దేహక్రియలకు వినియోగమవుతాయి. మరికొన్ని జీవితకాలంలో మనం చేసే కర్మల ద్వారా ముడిపడతాయి. మొదటిరోజు డ్రైవింగ్‌ వీల్‌ ముందు కూర్చున్నప్పుడు... కారు నడపడం మనకు కష్టంగా అనిపిస్తుంది. తరువాత నెమ్మదిగా దానికి అలవాటు పడతాం. ఎందుకంటే... అప్పటివరకూ వాడుకలోలేని న్యూరాన్లను మన మెదడు హార్డ్‌ వైరింగ్‌ ద్వారా జోడించి, డ్రైవింగ్‌కు సంబంధించిన అన్ని చర్యల్లో పాల్గొనేలా చేస్తుంది. దీనికి సమయం పడుతుంది. మామూలు నడక, ఆటలతో మొదలుకొని ఒక సర్జన్‌ జరిపే శస్త్ర చికిత్స దాకా అన్ని రకాల నైపుణ్యాల విషయంలోనూ ఇదే జరుగుతుంది. హార్డ్‌ వైరింగ్‌ మెదడు తాలూకు శక్తిని బాగా ఆదాచేస్తుంది. తద్వారా మన జీవితాలను సులభతరం చేస్తుంది. శిశువుకు అనేక పనులు చేసే సామర్థ్యం ఉంటుంది. ఆ తరువాత కుటుంబం, సహచరులు, సమాజం మధ్యలో సాగే పెంపకంలో... అనేక నాడీబంధాలు (ప్యాటర్న్స్‌) ఏర్పడతాయి. ఈ నాడీబంధాలు బాహ్య ప్రపంచం నుంచి నిర్దిష్టమైన ప్రేరణలకు, అనుభూతులకు అలవాటు పడడం వల్ల... ఆ ప్రేరణలను, అనుభూతులను పొందడానికి మనం తీవ్రంగా కృషి చేస్తాం. ఈ అలవాట్లనే మనం ‘కోరికలు’ అని కూడా అనవచ్చు. మన నాడీబంధాలు పొగడ్తలను ఆశించి, ఆస్వాదిస్తాయి కాబట్టి... వాటిని వినడానికి మనం ఇష్టపడతాం. ఈ నాడీబంధాలే మనలో ఉత్పన్నమయ్యే ఆకాంక్షలకు, కలిగే దురభిప్రాయాలకు, మనలో ఏర్పడే అంచనాలకు పునాదులు. ఈ నాడీబంధాలన్నిటి కలయిక, వాటి అలవాట్ల మీద ఆధారపడే మన ప్రవర్తనలన్నిటినీ కలిపితే అదే అహంకారం. దాన్ని ఛేదించినప్పుడు మాత్రమే మనల్ని మనలో కేంద్రీకరించుకోగలం. తద్వారా బాహ్య ప్రేరణలతో నిమిత్తం లేకుండా... శాశ్వతమైన సంతోషాన్ని పొందగలం. దీన్నే శ్రీకృష్ణుడు ‘ఆత్మ రమణీయత’ అని చెబుతున్నాడు. గీతోపదేశం ప్రకారం జీవించడం అంటే... భగవద్గీత అందించిన అనేక సాధనాలను, నియంత్రణలను పాటించి... ఈ నాడీబంధాల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవడమే. ఈ విధంగా విముక్తమయినప్పుడు... మన దుఃఖానికి కారణమైన విభజనల నుంచి, భేదాభిప్రాయాల నుంచి కూడా విముక్తి పొందుతాం. శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాం.

 

 


Contact Us

Loading
Your message has been sent. Thank you!