
‘‘కర్మయోగులు ఫలాపేక్షను వదిలిపెట్టి... ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరాల ద్వారా... కేవలం అంతఃకరణశుద్ధి కోసం మాత్రమే కర్మలను ఆచరిస్తారు’’ అని ‘భగవద్గీత’లోని ‘కాయేన మనసా బుద్ధ్యా...’ అనే శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎవరైనా వర్తమానంలో ఫలాపేక్షను వదిలిపెట్టినా... గత జన్మ కర్మబంధాలను అతను నిర్మూలించుకోవాలి. అందుకే అతను కర్మలను చేస్తూ ఉంటాడు. ‘అనాసక్తి’ అనే స్థితికి చేరుకున్న తరువాత... లౌకిక జగత్తులో అతను పొందాల్సినది ఏదీ ఉండదు కాబట్టి... అన్ని కర్మలూ అంతఃకరణ శుద్ధికి దారి తీస్తాయని కూడా అర్థం చేసుకోవచ్చు. ‘‘నిష్కామ కర్మయోగి కర్మఫలాలను త్యజించి... భగవత్ రూపమైన శాంతిని పొందుతాడు. కర్మఫలాసక్తుడైనవాడు ప్రతిఫలాపేక్షతో కర్మలను ఆచరించి, వాటికి బద్ధుడు అవుతాడు’’ అని కూడా శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు.
మనకు కర్మ చేసే అధికారం ఉంది కానీ కర్మ ఫలాలమీద అధికారం లేదనేది ‘భగవద్గీత’కు మూలస్తంభం లాంటి ఉపదేశం. కర్మ ఫలాలను వదిలేయడం అంటే... వచ్చే ఫలితం, పరిణామం ఏదైనా... అది అద్భుతమైనదైనా, భయానకమైనదైనా సమత్వ బుద్ధితో ఆమోదించడానికి సిద్ధంగా ఉండడం. అలా సిద్ధపడని వ్యక్తికి బుద్ధి, భావం రెండూ ఉండవనీ, ఫలితంగా అతనికి ప్రశాంతత లేదా ఆనందం... రెండూ ఉండవనీ శ్రీకృష్ణుడు తెలిపాడు. ‘‘అంతఃకరణని అదుపులో ఉంచుకొని, సాంఖ్యయోగాన్ని ఆచరించే వ్యక్తి... కర్మలను ఆచరించకుండానే, ఆచరింపజెయ్యకుండానే... సమస్త కర్మలనూ మాసికంగా త్యజించి, పరమాత్మ స్వరూపంలో స్థితుడై, ఆనందాన్ని అనుభవిస్తాడు’’ అని చెప్పాడు.
కర్మ చేస్తున్నప్పుడైనా లేదా ఒక కర్మకు కారణంగా మారుతున్నప్పుడైనా మానసికంగా అన్ని కర్మలనూ త్యజించడం కీలకమైనది. మనం చేసినా, చేయకపోయినా కర్మలు జరుగుతూనే ఉంటాయి. మనం కేవలం వాటిలో ఒక భాగం అవుతాం. మనం భోజనం చేసిన తరువాత... అది జీర్ణమై, మనలో భాగం అయ్యే ముందు వందలాది చర్యలు జరుగుతాయి. కానీ వాటి గురించి మనకి ఏమీ తెలీదు. నిజానికి జీర్ణక్రియ లాంటి అద్భుతాలు కూడా మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి.
https://www.andhrajyothy.com/2024/navya/gitasaram-1201197.html