దేన్ని తెలుసుకున్న తరువాత ఇక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదో... అటువంటి జ్ఞానాన్ని ఎక్కడ దాచాలి?’’ అని ఒకసారి సృష్టికర్త ఆలోచించాడట. ఎత్తయిన పర్వతాల మీదో, లోతైన సముద్రంలోనో దాచాలని ఆయన భార్య సలహా ఇచ్చిందట. కానీ మనిషి పర్వతాలు ఎక్కగలడు, సముద్రాలను ఈదగలడు... కాబట్టి ఆ రెండూ సరికావని అనుకున్నారు. ఆ తరువాత... ఆ జ్ఞానాన్ని మనిషి లోపలే దాచాలని నిర్ణయించారు. ఆశ్చర్యం ఏమిటంటే... మనిషి జీవితాతం దాన్ని బయటే వెతుకుతూ ఉంటాడు. ‘‘కచ్చితంగా ఈ ప్రపంచంలో జ్ఞానంలా పవిత్రమైనది ఏదీ లేదు. తగిన సమయంలో... యోగంలో పరిపూర్ణత సాధించినవాడు దాన్ని తనలోపలే కనుక్కుంటాడు’’ అనే శ్రీకృష్ణుడి బోధించినది అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ ఎంతో ఉపకరిస్తుంది. జ్ఞానం తాలూకు సారం మనలోనే ఉంది. అందరిలో సమపాళ్ళలో ఉంది. దాన్ని మనం సాధించుకోవడమే కాకుండా... ఇతరుల్లోనూ ఉందని గుర్తించాలి. ‘‘శ్రద్ధావాన్, జితేంద్రియుడు ఈ జ్ఞానం పొందడం ద్వారా పరమశాంతిని పొందుతాడు’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రద్ధ లేని అజ్ఞాని నాశనమవుతాడనీ, అతనికి ఇహలోకంలో లేదా మరెక్కడా సుఖం ఉండదనీ హెచ్చరించాడు. శ్రద్ధ అనేది భగవద్గీత మౌలిక ఉపదేశాల్లో ఒకటి. అర్జునుడు ‘శ్రద్ధావాన్’ కావాలని శ్రీకృష్ణుడు ప్రోత్సహించాడు. శ్రద్ధ అంటే... మన మార్గంలోకి వచ్చే దేనినైనా ఆ పరమాత్ముని ప్రసాదంగా భావించి, కృతజ్ఞతతో స్వీకరించే అంతర్గత శక్తి. ఇంద్రియాలను ఉపయుక్తంగా మార్చుకోవడం అనేది భగవద్గీతలో అంతర్లీనమైన ఉపదేశం. మరొకచోట శ్రీకృష్ణుడు ఇంద్రియాలను అడవి గుర్రాలతో పోలుస్తూ... వాటిని బాగా అర్థం చేసుకొని స్వారీ చేసే శిక్షకునిలా... ఇంద్రియాలను నియంత్రించాలని మనకు చెబుతాడు. ఇది నిశ్చయంగా అర్థం చేసుకోవడమే కానీ... అణచివేయడం కాదు.