జీవితాంతం నేర్చుకోగలిగే సామర్థ్యం మనుషులకు మాత్రమే దక్కిన వరం. కానీ ‘ఏది నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి?’ అనేవి కీలక ప్రశ్నలు. సత్యాన్ని గ్రహించిన జ్ఞానులకు సాష్టాంగ ప్రణామం చేయడం, ప్రశ్నించడం, సేవ చేయడం ద్వారా తత్త్వ జ్ఞాన ప్రాప్తి కలుగుతుందంటూ శ్రీ కృష్ణుడు ‘భగవద్గీత’లో ‘తద్విద్ధి ప్రాణిపాతేనా పరిప్రశ్నేన సేవయా’ అనే శ్లోకం ద్వారా ఒక మార్గాన్ని సూచించాడు. సాష్టాంగ ప్రణామం అంటే వినమ్రత, వినయం, ఇతరుల దృక్పథాన్ని అర్థం చేసుకొనే సహనం, విశాల దృక్పథం. ఇది మనం అహంకారాన్ని అధిగమించామనడానికి ఒక సూచిక. ప్రశ్నించడం అంటే... అవగాహన వచ్చేవరకూ మనం ఆలోచిస్తున్నవాటిని, చెబుతున్నవాటిని, చేస్తున్నవాటిని... అన్నిటినీ ప్రశ్నిస్తూనే ఉండడం. ‘ఆత్మ సాక్షాత్కారం పొందినవారు (గురువు) ఎవరు? వారిని కనుగొనడం ఎలా?’ అనేది తదుపరి ప్రశ్న. తనకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పిన జ్ఞాని తాలూకు ఉదంతాన్ని ‘శ్రీమద్భాగవతం’లో శ్రీకృష్ణుడు వివరిస్తాడు. భూమి నుంచి క్షమను, పసిబిడ్డల నుంచి అమాయకత్వాన్ని, గాలి నుంచి నిస్సంగాన్ని, తేనెటీగల నుంచి నిల్వ చేయడాన్ని నిరోధించే లక్షణాన్ని, సూర్యుడి నుంచి సమానత్వాన్ని, చేపల నుంచి ఇంద్రియాల ఉచ్చులో పడకుండా ఉండే సామర్థ్యాన్నీ... ఇలా పలు విషయాలు నేర్చుకున్నానని ఆ జ్ఞాని చెబుతాడు. ‘ఏది నేర్చుకోవాలి?’ అనే విషయం గురించి శ్రీకృష్ణుడు వివరణనిస్తూ ‘‘దేన్ని తెలుసుకోవడం ద్వారా మీరు మళ్ళీ ఈ విధమైన వ్యామోహంలో పడరో, దేనిద్వారా మీరు సమస్త ప్రాణులనూ మీలోనే చూస్తారో... ఆ తరువాత అందరినీ పరమాత్మనైన నాలో చూస్తారో... దాన్ని నేర్చుకో’’మని ‘యజ్ఞత్వా న పునర్మోహ’ అనే శ్లోకంలో చెబుతాడు. మనం మనలోని మంచిని పొగుడుకుంటూ... ఇతరుల్లోని తప్పులను ఎత్తిచూపుతూ ఉంటాం. ఈ శ్లోకం మనలోనూ లోపాలు ఉన్నాయనీ, ఇతరులలో కూడా మంచి ఉందనీ మనం గుర్తించాలని చెబుతుంది. అంతటా ఉన్నది భగవంతుడే. ఈ చిన్న విషయాన్ని గుర్తిస్తే చాలు... భ్రమలకు అవకాశం లేదు.