Gita Acharan |Telugu

శ్రీకృష్ణుడు భగవద్గీతలో రెండు సందర్భాలలో యజ్ఞరూపమైన నిష్కామ కర్మల గురించి మాట్లాడాడు. ప్రేరేపిత కర్మలు మనల్ని కర్మ బంధనాల్లో ఇరికిస్తాయని హెచ్చరించాడు. అందుకే ఆసక్తికి, విరక్తికి అతీతమైన అనాసక్తితో కర్మలను ఆచరించాలని సలహా ఇచ్చాడు. ‘యజ్ఞం’ అనే నిస్వార్థ కర్మ అత్యున్నత శక్తిని కలిగి ఉన్నదని, ప్రారంభంలో ఈ శక్తిని ఉపయోగించే సృష్టికర్త ఈ సృష్టిని చేశాడనీ పేర్కొన్నాడు. యజ్ఞానికి సంబంధించిన అనేక ఉదాహరణలను కూడా శ్రీకృష్ణుడు వివరించాడు. ఇవన్నీ నిష్కామ కర్మల వేర్వేరు రూపాలనీ, వాటి గురించిన జ్ఞానం మనకు విముక్తిని (మోక్షాన్ని)కలిగిస్తుందనీ చెప్పాడు. మోక్షం గురించి భగవంతుడు ఇచ్చిన ఈ హామీ మనకు శిరోధార్యం

పాపం గురించి శ్రీకృష్ణుడు వివరిస్తూ ‘‘సుఖం-దుఃఖం, లాభం-నష్టం, విజయం-ఓటమి అనే ద్వంద్వాల మధ్య నెలకొన్న అసమతుల్యత నుంచి ఉత్పన్నమయ్యే చర్యే పాపం’’ అని సూచించాడు. దీనివల్ల గాఢమైన పశ్చాత్తాపం, పగ, ద్వేషం లాంటి కర్మ బంధనాలకు మనం గురి అవుతాం. ‘‘అంతఃకరణాన్నీ, శరీరేంద్రియాలనూ జయించినవాడు, సమస్త భోగ సామగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి... కేవలం శారీరక కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. అతను పాపాలను పొందడు’’ అని శ్రీకృష్ణుడు ఉద్బోధించాడు. ‘‘కొందరు అనాసక్తితో కర్మలను ఆచరించడం ద్వారా పాపాలను నాశనం చేసుకున్నారు’’ అని తెలిపాడు. ఇది యజ్ఞరూపమైన నిష్కామకర్మల ద్వారా పాపాలను నాశనం చేయడం గురించి భగవంతుడు ఇచ్చిన హామీ.‘‘మనకు కర్మపై హక్కు ఉంది కానీ కర్మ ఫలం మీద అధికారం లేదు’’ అని కూడా శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. ‘యజ్ఞం అనే నిస్వార్థ కర్మ తాలూకు శేషమే (ఫలమే) బ్రహ్మం అనే అమృతం’ అనే రహస్యాన్ని కూడా వెల్లడించాడు. దీని అర్థం ఏమిటంటే... మన జీవితాలలో ఎప్పుడైనా ఏదైనా పొందామంటే... అది మనం స్పృహతోనో లేదా తెలియకుండానో చేసే నిస్వార్థ కర్మల ఫలితంగానే పొందుతాం. మన సంతోషాన్ని కొలమానంగా తీసుకుంటే... ‘‘నిస్వార్థ కర్మలు చేసి, సంతుష్టుడైన వ్యక్తి మరింత సంతుష్టుడవుతాడు. స్వార్థ కర్మలు చేసి దుఃఖితుడు మరింత దుఃఖితుడు అవుతాడు’’ అని భగవద్గీతలోని ‘యజ్ఞశిష్టామృత భుజో’ అనేశ్లోకం పరోక్షంగా సూచిస్తోంది. అంటే సంతోషం మరింత సంతోషాన్ని, దుఃఖం మరింత దుఃఖాన్నీ తెస్తుంది. ఇది ‘యజ్ఞఫలమైన తృప్తి’ అనే అమృతం గురించి భగవంతుడు ఇచ్చిన హామీ. ప్రేరణే ఒక కర్మను పాపంగా మారుస్తుంది. అదే పనిని యజ్ఞంలా చేసినప్పుడు... అదే పుణ్యకార్యం అవుతుంది. ఇది మోక్షం, సంతృప్తి అనే అమృతం తప్ప మరొకటి కాదు.

కె.శివప్రసాద్‌

ఐఎఎస్


Contact Us

Loading
Your message has been sent. Thank you!