
భగవద్గీతలోని ‘అనాసక్తి’, ‘వీత్‌రాగ్’ లాంటి కొన్ని పదాలు ఆ మహా గ్రంథంలోని సారాంశాన్ని సూచిస్తాయి. ఆసక్తి, విరక్తి రెండు ధ్రువాలు అయితే... ఆ రెండిటినీ అనాసక్తి అధిగమిస్తుంది. అదే విధంగా ‘వీత్‌రాగ్’ అంటే రాగం లేదా విరాగం కాదు... ఆ రెండిటినీ అధిగమించినది. నిజానికి ఈ (భిన్న) ధ్రువాలనేవి అహంకార వ్యక్తీకరణ తప్ప మరొకటి కాదు. ఒక వ్యక్తిలో అహం మాయమైనప్పుడు... అతను అన్ని ధ్రువాలనూ అధిగమిస్తాడు. ఆ దశనే మనం ‘ముక్తి’, ‘మోక్షం’ అని పిలుస్తూ ఉంటాం.
‘‘ఆసక్తి, దేహాభిమానం, మమకారం ఏమాత్రం లేనివాడు, జ్ఞానంలో స్థిరపడినవాడు, కేవలం యజ్ఞం కోసమే కర్మలు ఆచరించేవాడు అయిన మనిషికి కర్మలూ, వాటి ఫలాలూ అంటవు’’ అన్నాడు శ్రీకృష్ణుడు. అహం అంటే మన సంపదలు, ఆస్తులతో మనకు కలిగే గుర్తింపు. స్నేహితులు- శత్రువులు, ఇష్టాలు- అనిష్టాలు, ఆలోచనలు- భావాలతో మనకు మనం ఇచ్చుకొనే గుర్తింపు. వీటన్నిటినీ వదిలివేయడం వల్ల భయం, బాధ, ఆగ్రహానికి దారితీసే ఆలోచనలు సమసిపోతాయి. అప్పుడు మనలో తాత్కాలికమైన శూన్యత ఏర్పడుతుంది. దానికి మనం సిద్ధంగా ఉండం. కాబట్టి అహాన్ని వదిలివేయడం అంత తేలికైన పని కాదు. గుర్తించదగ్గ విషయం ఏమిటంటే... యాజమాన్యం, గుర్తింపు, కర్తృత్వం తాలూకు ఆలోచనను, భావాలను వదిలివేయడం అవసరం. అంతే తప్ప సంబంధాలు, వస్తువులు లేదా వ్యక్తులను వదిలివేయడం కాదు. ఈ వ్యత్యాసాన్ని మనం చక్కగా తెలుసుకుంటే... ముక్తి లభిస్తుంది.
‘నేను’ అనే పదాన్ని వదిలేసిన వ్యక్తి చేసే నిస్వార్థ కర్మలన్నీ యజ్ఞం తప్ప మరొకటి కాదు. ‘యజ్ఞం’ అంటే ‘అగ్నికి నైవేద్యాలు సమర్పించే కర్మ’ అని సామాన్యమైన అర్థం. ఇక్కడ దాన్ని త్యాగం లేదా ఇచ్చిపుచ్చుకోవడాన్ని తెలియజేయడం అనే అర్థంలో ఉపయోగించడం జరిగింది. మనం అగ్నికి ఆహుతిని ఇస్తాం. అగ్ని మనకు తిరిగి వేడిని ఇస్తుంది. ఆ వేడి వంట చేయడం, నీటిని ద్రవరూపంలో ఉంచడం, శరీర ఉష్ణోగ్రతను సమపాళ్ళలో ఉంచటం లాంటి ప్రయోజనాల నిమిత్తం మన జీవితానికి అవసరం. మానవ శరీర నిర్వహణ ఒక యజ్ఞం లాంటిది. ఇక్కడ ఒక అవయవం ఇస్తుంది, మరొక అవయవం తీసుకుంటుంది. అవి ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి.
అందుకే ‘‘అర్పణ, నైవేద్యం, అగ్ని, యాజ్ఞికుడు... ఇవన్నీ బ్రహ్మమే. నిష్కామకర్మ అయిన యజ్ఞం ద్వారా సాధించిన ఫలితాలు కూడా బ్రహ్మమే’’ అని విశదీకరించాడు శ్రీకృష్ణుడు. అహంకారాన్ని వదులుకోవడం ద్వారా పొందే ఏకత్వం ఇదే.