
‘‘పార్థా! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహిస్తాను. మనుషులందరూ వివిధ రీతుల్లో నా మార్గాన్నే అనుసరిస్తాను’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ మాటల ద్వారా శక్తిమంతమైన అవ్యక్తానికీ, వస్తురూపం దాల్చిన వ్యక్తానికీ మధ్య సంబంధం గురించి అంతర్‌దృష్టిని ఇచ్చాడు. ఆయన స్పష్టం చేశిన అంశాల్లో మొదటిది: మనం ఏ మార్గాన్ని అనుసరించినా, ఆ దారులు ఎంత వైరుధ్యంతో కనిపించినా... అవన్నీ అవ్యక్తమైన పరమాత్మను చేరుకొనే మార్గాలేనని భగవంతుడు ఇచ్చిన హామీ. రెండవది: మన భావాలు, ఆలోచనలు, చర్యలను ప్రతిబింబించే, ప్రతిధ్వనించే బహుముఖమైన అద్దం లాంటివాడు భగవంతుడు. మూడవది: మనం ఒక విత్తనాన్ని నాటినప్పుడు అది మొలకెత్తి, చెట్టుగా పెరగడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో జాప్యం వల్ల మనం పరమాత్మ ప్రతిధ్వని సూత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం.
మన జీవితాలను షరతులు లేని ప్రేమతో నింపుకొంటే... శ్రద్ధ, ప్రేమ అనివార్యంగా తిరిగి వస్తాయి. మన జీవితాలను ఆనందమయం చేస్తాయి. మనం కోపాన్నీ, భయాన్నీ, ద్వేషాన్నీ, క్రూరత్వాన్నీ లేదా అసూయను నాటితే అవే తిరిగి వ్యాపించి... మన జీవితాలను దుర్భరం చేస్తాయి. మనం ఏది విత్తితే దాన్నే కోసుకుంటాం. దీనికి లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే... విత్తడం, కోయడం మధ్య ఉన్న జాప్యం కారణంగా... ఆ రెండిటికీ మధ్య ఉన్న దృఢమైన సంబంధాన్ని మనం మరచిపోతాం. పూర్తిగా వదిలేస్తాం. పైన పేర్కొన్న అంశాలు స్థూల, సూక్ష్మ స్థాయిలు రెండిటిలోనూ పని చేస్తాయి. మనం పెద్ద పెద్ద కలలను నిజం చేసుకోవాలని చూస్తున్నప్పుడు... అత్యున్నత స్పృహను అనుభవపూర్వకంగా గ్రహించడానికి చిన్న చిన్న అనుభవాలు సహాయపడతాయి. వాటిని మనం ఎప్పటికీ కోల్పోకూడదు.
‘‘ఈ లోకంలో కర్మఫలాలను ఆశించేవారు ఇతర దేవతలను పూజిస్తారు. ఎందుకంటే అలా చెయ్యడం వల్ల కర్మల వల్ల కలిగే సిద్ధి వారికి లభిస్తుంది’’ అన్నాడు శ్రీకృష్ణుడు. దేవతలు పరమాత్మ రూపమే తప్ప మరొకటి కాదు. పరమాత్మను పొందడానికి మనం అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. కానీ దానికి సమయం పడుతుంది. మనం అహంకారాన్ని వదిలేస్తూ... పరమాత్మ సాక్షాత్కారం వైపు సాగించే ప్రయాణంలో దేవతలు మజిలీలలాంటివారు.