Gita Acharan |Telugu

జీవితం రెండు విధాలైన ప్రక్రియను కలిగి ఉంటుంది. అవి స్పందన, ప్రతిస్పందన. మనం ఇంద్రియాల ద్వారా అనేక స్పందనలను స్వీకరిస్తాం. వాటికి ప్రతిస్పందిస్తూ ఉంటాం. ‘‘తత్త్వజ్ఞుడైన సాంఖ్యయోగి... చూస్తున్నా, వింటున్నా, స్పృశిస్తున్నా, ఏ వాసనైనా చూస్తున్నా, భుజిస్తున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, శ్వాసక్రియలు నడుపుతున్నా, మాట్లాడుతున్నా, దేన్నైనా గ్రహిస్తున్నా, త్యజిస్తున్నా, కన్నులు తెరుస్తున్నా, మూస్తున్నా... ఇవన్నీ చేస్తున్నది నేను కాదనీ, ఇంద్రియాలే వాటివాటికి సంబంధించిన విషయాల్లో పని చేస్తున్నాయనీ భావిస్తాడు’’ అంటూ సత్యాన్ని తెలిసిన వ్యక్తి తాలూకు శిఖరాగ్రస్థాయి అనుభూతిని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వర్ణించాడు.

 

మనం మన రోజువారీ జీవితంలో మన గురించి వచ్చే పొగడ్తల వల్లా, విమర్శల వల్లా జనించే ఉద్వేగాలకు గురవుతూ ఉంటాం. తన గాన మాధుర్యాన్ని మెచ్చుకున్న నక్క పొగడ్తలను విని, నోట్లో మాంసాన్ని వదిలేసిన కాకిలా... పొగడ్తలు మనల్ని మైమరచిపోయేలా చేస్తాయి. అలాగే ఎవరైనా విమర్శించినప్పుడు... విమర్శ స్థాయిని బట్టి, విమర్శకుడి బలాన్ని బట్టి... మౌనం నుంచి మాటలు లేదా భౌతిక చేష్టల వరకూ మన స్పందన మారుతుంది. ఈ ఉద్వేగాలకు కారణమైన ప్రశంసలనూ, విమర్శలనూ నిజమని ఊహించి... ఆ ఊహల ప్రకారం మనం ప్రవర్తిస్తాం. ఎప్పుడైతే వాటిని వ్యక్తిగతంగా తీసుకుంటామో... అప్పుడు ఇలాంటి భావోద్వేగాలు దుస్థితివైపు దారి తీస్తాయి. మన బాహ్య ఇంద్రియాలు ఆధునిక ఎలకా్ట్రనిక్‌ పరికరాలలాంటివి. చెవి శబ్దానికి, కన్ను కాంతికి స్పందించినట్టు... ఇవి స్వయంచాలకంగా బాహ్యస్పందనలకు ప్రతిస్పందిస్తాయి. మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవడానికి ఇవ్నీ అవసరమే. కొన్నిసార్లు బాహ్య స్పందనలకు ప్రతిస్పందన స్వయంచాలకంగా ఉండకపోవచ్చు లేదా మనవల్ల అది నియంత్రితం కావచ్చు. అజ్ఞాన జీవనమే ‘ప్రతిక్రియ జీవనం’ అంటే మన ప్రతిస్పందనలు యాంత్రికంగా ఉండడం. కానీ ఇంద్రియ విషయాలవైపు మనల్ని యాంత్రికంగా లాక్కువెళ్ళే ఇంద్రియాల స్వభావాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా... మనం ఆ స్పందనను నియంత్రించి, మన జీవితాలను ఆనందమయం చేసుకోవచ్చు.

 

పొగడ్త లేదా విమర్శ లాంటి స్పందనలతో మనల్ని మనం అనుసంధానించుకొనే స్వభావమే మనకు ఒక ప్రతిబంధకం. అది జీవితకాలం పాటు బాధించే కర్మబంధాలను సృష్టిస్తుంది. కనుక, ‘‘ఇంద్రియ విషయాల్లో ఇంద్రియాలు యాంత్రికంగా స్పందిస్తున్నాయి, ఇందులో నేనేదీ చేయడం లేదు’’ అని గుర్తించాల్సిందిగా శ్రీకృష్ణుడు సూచిస్తున్నాడు. అంటే కర్త నుంచి సాక్షిగా పరిణామం చెందడం. చేసే కర్మలకు ప్రతిఫలాన్ని ఆలోచించకుండా... ప్రేక్షకునిలా ఉండడం.


Contact Us

Loading
Your message has been sent. Thank you!