Gita Acharan |Telugu

 

భగవద్గీతలో అర్జునుడు, శ్రీకృష్ణుడు... ఇద్దరూ ‘నేను’ అనే పదాన్ని ఉపయోగించారు. కానీ అర్థం, సందర్భం భిన్నంగా ఉంటాయి. అర్జునుడి ‘నేను’ అనేది అతని భౌతిక శరీరం, ఆస్తులు, భావాలు, నమ్మకాలను సూచిస్తుంది. అంతేకాకుండా అతని కుటుంబం, స్నేహితులు, బంధువులు కూడా అందులో కలిసి ఉంటారు. మన స్థితి కూడా అర్జునుడి కన్నా భిన్నంగా లేదు. ముఖ్యంగా మనం కొన్ని వస్తువులకు యజమానులం అనీ, మరికొన్నిటికి కాదనీ భావిస్తాం

 

శ్రీకృష్ణుడు ‘నేను’ అని ఉపయోగించినప్పుడు... అది సమగ్రతను సూచిస్తుంది. మన ఇంద్రియాల పరిమితి కారణంగా మనం గ్రహించే విభిన్న ద్వంద్వాలు, వైరుధ్యాల వల్ల అన్నిటిలోనూ మనం విభజనలను చూస్తాం. కానీ శ్రీకృష్ణుని ‘నేను’ ఈ విభజనల సమ్మేళనం. శ్రీకృష్ణుడు అదే పంథాలో కొనసాగుతూ.. మరోచోట ‘‘నేను పుట్టుకతో పాటు మరణాన్ని కూడా’’ అని చెప్పాడు. శ్రీకృష్ణుడు సముద్రం అయితే మనం ఆ సముద్రంలో నీటి బిందువులలాంటి వాళ్ళం. కానీ అహంకారం వల్ల... మనకు సొంత వ్యక్తిత్వం ఉందనుకుంటాం. ఎప్పుడైతే ఆ బిందువు తన వ్యక్తిత్వ భ్రమను త్యజించి, సముద్రంలో కలిసిపోతుందో... అప్పుడు అదే మహా సముద్రం అవుతుంది.

‘‘అర్జునా! నా అవతారాలు, కర్మలు.. దివ్యమైనవి. అంటే నిర్మలమైనవి, అలౌకికమైనవి. వాటి స్వభావాన్ని అర్థం చేసుకున్నవారు తమ దేహాన్ని చాలించిన తరువాత మళ్ళీ జన్మించరు. నన్ను చేరుకుంటారు’’ అని శ్రీకృష్ణుడు బోధించాడు. అహంకారాన్ని విడిచిపెట్టి, విభజనలన్నీ ఒకటేనని అంగీకరించే సామర్థ్యం సంపాదించాలనేది ఈ ఉపదేశం అంతరార్థం. శ్రీకృష్ణుడు ‘వీత్‌ -రాగ్‌’ అనే పదాన్ని ఉపయోగించాడు. ఇది రాగం లేదా విరాగం కాదు. విరాగాన్ని కూడా అధిగమించి... రాగ, విరాగాలను ఒకటిగా...

అనుభవ స్థాయిలో చూడగలిగే మూడో స్థితి. భయ క్రోధాలకు కూడా ఇది వర్తిస్తుంది.

అలాగే ‘జ్ఞాన-తపస్సు’ అనే మరో పదాన్ని కూడా శ్రీకృష్ణుడు ప్రయోగించాడు. తపస్సు అంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానం తప్ప మరొకటి కాదు. మనలో చాలామంది దీన్ని పాటిస్తాం. ఇంద్రియ సుఖాలు, భౌతిక ఆస్తులను పొందడానికి సాగించే తీవ్రమైన అన్వేషణను అజ్ఞానంతో చేసే తపస్సు అని కూడా చెప్పవచ్చు. దాన్నే ఇంద్రియ లాలసను విడిచిపెట్టి చేస్తే... అది జ్ఞాన-తపస్సుగా మారుతుంది. జాగరూకతతో కూడిన క్రమశిక్షణ అనే జ్ఞాన- తపస్సును కొనసాగించమని శ్రీకృష్ణుడు మనకు సూచిస్తున్నాడు. ‘‘ఇదివరకు కూడా సర్వదా రాగ భయ క్రోధ రహితులైన (వీతరాగభయక్రోధా) ఎంతోమంది... దృఢమైన భక్తి తాత్పర్యాలతో, స్థిరమైన బుద్ధితో నన్ను ఆశ్రయించి, జ్ఞాన తపస్సంపన్నులై, పవిత్రులై నా స్వరూపాన్ని పొందారు’’ అని ఆ భగవానుడు చెప్పాడు.


Contact Us

Loading
Your message has been sent. Thank you!