Gita Acharan |Telugu

వివేకాన్ని ఉపయోగించి ‘మోహ కలిలం’... అంటే భ్రాంతి తాలూకు చీకటిని... మనం దాటగలిగితే, మనం వింటున్న లేదా వినబోతున్న వాటి పట్ల ఉదాసీనంగా, నిర్వికారంగా ఉండగలమని చెప్పాడు శ్రీకృష్ణుడు.

మోహాన్ని అధిగమించినప్పుడు... ఇంద్రియాల ద్వారా మనలో కలిగే వికారాలు మన సంకల్పాన్ని ప్రభావితం చేసే శక్తిని కోల్పోతాయన్నది ఆయన బోధలోని అంతరార్థం. ఇక్కడ ‘వినడం’ అనే ఉదాహరణను శ్రీకృష్ణుడు ఎందుకు ఎంచుకున్నాడంటే... ప్రశంస కావచ్చు, విమర్శ కావచ్చు, పుకార్లు కావచ్చు... మనం తరచూ ఇతరుల మాటలకు ప్రభావితులం అవుతాం, కాబట్టి.

అహంకారంలాగే మోహాన్ని కూడా సరైన పదాలు దొరకనప్పుడు వర్ణించడం కష్టం. ప్రాథమికంగా, ఏది మనది, ఏది మనది కాదు అనే తేడాను గుర్తించలేకపోవడంమే మోహం. వర్తమానంలో, భవిష్యత్తులో మనకు ఉండే భౌతికమైన ఆస్తులకు ‘నేనే యజమానిని’ అనే భావన. వాస్తవానికి మనం వాటికి యజమానులం కాదు. మనదికాని దాన్ని అంటిపెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు... ఏది నిజంగా మనదో తెలుసుకోలేం. ఈ లక్షణాన్ని ‘కలిలం’ లేదా ‘ఆధ్యాత్మికమైన చీకటి’గా శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. ఆ చీకటిని అధిగమించినప్పుడు నిర్వేదాన్ని పొందుతామన్నాడు. నిర్వేదాన్ని ‘ఉదాసీనత’గా కొందరు వర్ణించినప్పటికీ, అది అజ్ఞానంలోనుంచి పుట్టిన నిష్ర్కియాపరమైన లేదా ప్రతికూలమైన ఉదాసీనత కాదు. ఎరుక నుంచి లేదా అవగాహన నుంచి పుట్టే స్థితి. ఇది బంధాలను పెంచుకోవడమూ కాదు, వాటికి దూరం కావడమూ కాదు... ఆ రెండిటికీ మించినది. తీర్పులు ఇవ్వని, ఎలాంటి ముద్రలూ వేయని క్రియాశీలమైన అంగీకారం. ఇతరుల వల్ల ప్రభావితమయ్యే జీవితంలో... మన ఆస్తులు, సామర్థ్యాలు, విజయాలు, ప్రవర్తన, రూపం లాంటి అన్నిటికీ ఇతరుల నుంచి ఆమోదాన్నీ, ప్రశంసలనూ మనం కోరుకుంటాం. వాటి కోసం ఆరాటపడతాం. జ్ఞానం ద్వారా మోహాన్ని అధిగమించేవరకూ.... ప్రతిఫలదాయకమైన ఈ అనుభూతుల కోసం జీవితమంతా కష్టపడి పని చేస్తూ ఉంటాం. మోహం తెచ్చిన ఈ చీకటిని ఎప్పుడైతే సమతుల్యత ద్వారా, పొందికైన వివేకం ద్వారా మనం తొలగించుకుంటామో.. అప్పుడు వర్తమానంలో లేదా భవిష్యత్తులో కలిగే ఈ ఇంద్రియ భావనలు మన మీద ఇక ఏమాత్రం ప్రభావం చూపించవు.


Contact Us

Loading
Your message has been sent. Thank you!